అవార్డు చిత్రమవుతుంది...
నిర్మాత సి.కళ్యాణ్
దాసరి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'పరమవీరచక్ర'. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. తేజ సినిమా పతాకంపై అమీషాపటేల్, షీలా హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి బరిలోకి దిగనుంది. ఈ సందర్భంగా సినిమా గురించి నిర్మాత సి.కళ్యాణ్‌తో 'ప్రజాశక్తి' మాటామంతీ...
చిత్ర నిర్మాణం ఎలా జరుగుతోంది ?
చాలా ఆనందం ఉంది. గురువు దాసరి నారాయణరావు గారి 150వ సినిమా. ఇలాంటి అవకాశం రావటమే గొప్ప విషయం. అందునా దాసరి, బాలకృష్ణ కాంబినేషన్. నాకిది 38వ సినిమా. ప్రొడక్షన్‌పై చాలా సంతృప్తి కలిగింది. బాలకృష్ణతో పనిచేయటం చాలా కంఫర్ట్‌గా ఉంది. ఒక మహత్తర కార్యక్రమంగా చేపట్టాం.
నిర్మాణంలో ఎదురయిన అనుభవాలు?
కొన్ని షాట్స్ చాలా రిస్కీతో తీశాం. కులుమనాలిలో షూటింగ్ చేయాలి. అక్కడ కొన్ని సన్నివేశాలు ఐస్ లేకుండా, మరికొన్ని ఐస్‌తో ఉన్న సీన్స్ చేయాలి. మేం వెళ్ళిన టైమ్ ఐస్ ఉంటుందని వెళ్ళాం. కానీ అప్పుడు లేదు. వెంటనే దానికి సంబంధించిన సీన్స్ చేశాం. ఆ తర్వాత మంచు తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో ప్రజలు చాలామంది చనిపోయారు. చాలా బాధేసింది. మేం మళ్ళీ తర్వాత వెళ్ళి ఫుల్ ఐస్‌తో ఉన్నప్పుడు తీశాం. అలాగే న్యూజిలాండ్‌లో చర్చిలో షూటింగ్ చేయాలి. అనుకున్నట్లు అక్కడ చేశాం. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆ ప్రాంతమంతా భూకంపం వచ్చి నాశనమయింది. అందుకే ఒకటి గ్రహించాను. ప్రకృతి సహకరిస్తేనే నిర్మాతైనా, రైతయినా ఆనందంగా ఉంటాడు. రైతు ఆరుగాలం వ్యవసాయం చేశాక వరద వస్తే ఎంత నష్టపోతాడో.. నిర్మాతకూడా అంతే.
మీ సినిమాలో ఉన్న ప్రత్యేకతలేంటి ?
ఒక్క ముక్కలో చెప్పాలంటే..బాలకృష్ణ టీనేజ్ కుర్రాడిలా యాక్షన్ ఎపిసోడ్ చేయటం. 400 మీటర్ల ఎత్తులో రోప్‌మీదుగా ఈ కొండనుంచి ఆ కొండపైకి వెళ్ళాలి. యాభై ఏళ్ళ వయస్సులోకూడా డూప్‌లేకుండా అలవోకగా చేశాడు. బాలకృష్ణ చేస్తే నేనెందుకు చేయకూడదని...నేహాదూపియా కూడా ఆ షాట్ సహజంగా చేసింది. ఆ తర్వాత సంగీతపరంగా మణిశర్మ సంగీతం హైలైట్‌గా చెప్పాలి. సాహిత్యంలో క్లారిటీ ఉంది.
బడ్జెట్ ఎంతయింది ?
బాలకృష్ణ చిత్రాల్లో ఇది భారీ బడ్జెట్ చిత్రమని చెప్పగలను. 75 రోజులనుకున్నాం. అనుకున్నట్టుగానే తీయగలిగాం. కులూమనాలిలో ఫ్యామిలీ మొత్తం చనిపోయే సీన్ ఒక్కటి చేయలేకపోయాం. వెయ్యి ఎకరాల్లో ఆపిల్ తోట ఉంది. రాజభవనం లాంటి ఆ ఇంటిలో డెత్‌సీన్ చేయడానికి వారు ఒప్పుకోలేదు. అన్ని సీన్స్‌చేసి ఆ ఒక్కసీన్ కోసం తిరిగి వచ్చాక సెట్‌లో తీయాల్సి వచ్చింది. దానికోసం 23 లక్షలు అదనంగా ఖర్చయింది.
దాసరిగారితో సినిమా తీయడం ఎలా అనిపించింది?
ఆయన ఇన్ని సినిమాలు తీసినా, ఇదే మొదటి సినిమా అన్నట్టు కమిట్‌మెంట్‌గా చేశారు. నిర్మాతకు తెలియకుండా ఏదీ జరగకూడదని అన్నారు. ప్రతీ షాట్ చెప్పి తీసేవారు. నేను షూటింగ్‌కు రాకపోతే నా సోదరుడ్ని పంపేవాణ్ని. అయినా షూటింగ్‌కు బయలుదేరేముందు దాసరిగారు ఫోన్‌చేసి...ఈ టైమ్‌కు వెళ్లి... ఈ సీన్స్ తీస్తున్నానంటూ చెప్పేవారు. నిర్మాతను గౌరవించేవారు. ప్రతీ దర్శకుడు ఆవిధంగా నడుచుకోవాలి.
పరమవీరచక్ర ప్రోగ్రెస్ ఏమిటి?
అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌కూడా డిసెంబర్ 31నే పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. 2010 చిత్రాల్లో నంది అవార్డు దక్కే చిత్రమవుతుందని గట్టి నమ్మకముంది. కథ, కథనం ఆకట్టుకునేవిధానంతో, చక్కటి సందేశం ఇందులో ఉంది.
'సింహా' తర్వాత బాలకృష్ణపై అంచనాలుంటాయి? దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు?
తప్పకుండా ఉంటాయి. అంచనాలకు అనుగుణంగా ఉంటుంది. 2010లో సింహా అయితే, 2011లో పరమవీరచక్ర హిట్ అవుతుంది. మిగిలిన చిత్రాలు కూడా విజయవంతంగా ఆడాలని కోరుకుంటున్నాను.
'పరమవీరచక్ర' కథ ఏంటి ?
పరమవీరచక్ర అనేది చనిపోయినవారికి ఇచ్చే బిరుదని తెలిసిందే. కానీ బతికున్న వారికి ఎలాంటిది ఇవ్వాలి? అనేది ఇందులో చర్చించాం. అలా బతికున్న ఒకే ఒక్కడు బాణాసింగ్‌ను మేం సత్కరించాం. సరిహద్దుల్లో -45డిగ్రీల వాతావరణంలో ఎత్తైన ప్రదేశం ఉంది. దాన్ని అటువైపునుంచి పాకిస్తానీయులు ఆక్రమించారు. దాన్ని కాపాడ్డం కోసం మూడు బెటాలియన్లు వెళ్ళాయి. అందరూ చనిపోయారు. మూడో బెటాలియన్‌లో ఒకే ఒక్కడు బాణాసింగ్ ఎదురొడ్డి దాన్ని కాపాడాడు. అందుకే ఆయన పేరుమీదు దాన్ని 'బాణాపోస్ట్' అంటారు. మేం ఆయన గురించి తెలుసుకుని పరమవీరచక్ర కథ గురించి చెప్పాం. చాలా సంతోషంగా ఫీలయ్యారు.
వివిధ గెటప్స్‌లో బాలకృష్ణను చూపారు. కారణం ?
మేజర్ జయసింహ, సినిమా హీరో చక్రధర్ పాత్రల్లో కన్పిస్తారు. కానీ సినిమా హీరోగా పలు పాత్రలు పోషిస్తారు. కొమరం భీమ్, రావణబ్రహ్మ ఇలా పాత్రలుంటాయి. అవి కథలో భాగంగానే ఉంటాయి. ప్రత్యేకంగా 'రోబో'పై తీసిన సెటైర్ కామెడీ బ్రహ్మానందం, అలీ పాత్రలు అలరిస్తాయి.
తదుపరి చిత్రాలు?
అసలు ఇప్పటి పరిస్థితి రీత్యా సినిమాలు తీద్దామా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. కోట్లు పెట్టి సినిమా తీసి విడుదల ముందు ధియేటర్లు దొరక్క నానా అవస్థలు పడి రోగాలు తెచ్చుకోవడం అంత అవసరమా? అనే భయం కూడా ఉంది. దీనికంతటికి ధియేటర్ల గుత్తాధిపత్యం, రెంటల్ విధానమే కారణం. ఈ సమస్యలు పరిష్కారం అయితే ప్రతి నిర్మాతా హాయిగా ఉంటాడు. అలా అని సినిమాలు తీయలేకుండా ఉండలేను. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య...మూడు తరాలను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు కృష్ణవంశీ కథ తయారుచేస్తున్నారు. అది త్వరలో ఫైనల్ అవుతుంది. ఆ తర్వాత గౌతంమీనన్ చిత్రం ఒకటి చేయాలి.